దుండిగల్, మాదాపూర్ లలో హైడ్రా కూల్చివేతలు

దుండిగల్ (CLiC2NEWS): దుండిగల్ మున్సిపాలిటిలోని మల్లంపేట్ కత్వా చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. చెరువు ఎఫ్టిఎల్, బఫర్జోన్లో నిబంధనలకు విరుద్దంగా 20కిపైగా అనధికారిక విల్లాలను నిర్మించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మల్లంపేట్లోని లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. ప్రస్తుతం 8 విల్లాలను కూలుస్తున్నారు. మిగిలినవి ఖాళీచేయించి కూలుస్తామని వెల్లడించారు.
అదేవిధంగా అదేవిధంగా మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మాదాపూర్లోని సున్నం చెరువు 26 ఎకరాల్లో ఉంది. దీనిలోని ఎఫ్టిఎల్, బఫర్జోన్లో నిర్మించిన షెడ్లు, భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులు, హోటళ్లు కూల్చివేస్తుండటంతో వాటి యజమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎఫ్టి ఎల్ లోని సర్వే నంబర్లు 12,13,14,16 లో కబ్జా దారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నట్లు యజమానులు ఆరోపిస్తున్నారు. షెడ్లలో రూ. కోట్ల విలువైన సామాగ్రి ఉందని.. తీసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.