ఖైరతాబాద్: ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. కాళోజి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ కవుల్లో కాళోజి ఒకరన్నారు. సాహితీ రంగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. తన రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారని కొనియాడారు. తాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు కాళోజి.. 90వ దశకంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేవారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం.. జలమండలి ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఉద్యోగులు ప్రతిష్ఠించిన గణపతికి ఎండీ అశోక్ రెడ్డి పూజలు నిర్వహించారు.