తిరుమల లడ్డు వ్యవహారం.. సిఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ

హైదరాబాద్ (CLiC2NEWS): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని లాబ్ రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. శ్రీవారి ప్రసాదం విషయంలో జరిగిన వ్యవహారం యావత్ హిందూ మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఇది క్షమించరాని నేరమని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలన్నారు. ఈ విషయంలో ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
శ్రీవారి ప్రసాదంలో జంతవుల కొవ్వు వినియోగించడం అత్యంత నీచమని.. దీన్ని హిందూ ధర్మపై జరిగటిన భారీ కుట్రగానే భావిస్తున్నామన్నారు. లడ్గూ ప్రాముఖ్యతను తగ్గించేందుకు టిటిడిపై కోట్ల మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారని.. ఇది క్షమించరాని నేరమన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతుందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ఎర్చందనం కొల్లగొడుతూ ఏడు కొండల వాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. అన్యమతస్తులకు టిటిడి పగ్గాలు అందించడం.. ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.
ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే కల్తీ దందా జరిగే అవకాశం లేదని.. సిబిఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గు తేలే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబును బండిసంజయ్ కోరారు.