అమ్మానాన్నకు మళ్లీ పెళ్లి.. ఇంటికి చేరిన చిన్నారి

ఒంగోలు (CLiC2NEWS): రాజ్యాంగ నిర్ణయాల అమలులో చట్టం తన పని తాను చేసుకుపోయే క్రమంలో ఓ చిన్నారి తల్లదండ్రుల నుంచి దూరమై శిశు గృహం చేరింది. సంవత్సర కాలం పాటు అక్కడే పెరిగింది. జిల్లా కలెక్టర్ చొరవతో తిరిగి ఆ చిన్నారి అమ్మ ఒడికి చేరుకుంది.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుల్లల చెరువు మండలానికి చెందిన భాస్కర్ రెడ్డికి నందితతో 2022 సంవత్సరంలో పెళ్లి అయింది. కాగా అప్పటికే గర్భం దాల్చిన నందిత మైనర్ అనే విషయం పోలీసుల దృష్టికి రావడంతో ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. యువతి 2023లో ఆడ శిశువుకు జన్మనివ్వగా, అధికారులు ఆ చిన్నారిని శిశుగృహకు తరలించారు.
చిన్నారి తల్లి నందిత మేజర్ కావడంతో భాస్కర్ రెడ్డి ఆమెను చట్ట ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తమ చిన్నారిని తమకు అప్పగించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. కలెక్టర్ చొరవ తీసుకొని అందుకు అంగీకరించారు. దాంతో చిన్నారిని అమ్మానాన్నల ఒడికి కలెక్టర్ స్వయంగా సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమ అధికారులు, జిల్లా బాలల సంరక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.