తెలంగాణ, ఎపి కేడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం

ఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ, ఎపి కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారులను రెండు రాష్ట్రాలకు కేంద్రం సర్దుబాటు చేసింది. వారిలో కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమను తెలంగాణకు కేటాయించాలని పలువురు ఐపిఎస్ అధికారులు.. వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, అమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపిఎస్‌లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. కానీ.. వారందరినీ ఎపికి వెళ్లాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. వారందరూ ఈ నెల 16 లోగా ఎపిలో రిపోర్టు చేయాలని డివొపిటి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఎఎస్ అధికారులు ఎస్ ఎస్ రావత్, అనంత్ రాము , సృజన, శివశంకర్ లోతేటిలను సైతం రిలీవ్ చేస్తూ డిఒపిటి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడర్‌కు మార్చాలని కోరారు. దీనిపై గతంలో క్యాట్‌ను కూడా ఆశ్రయించారు. వారి అభ్యర్ధలను అంగీకరించిన క్యాట్.. వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. వారి అభ్యర్ధలను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచింది. హైకోర్టు ఆదేశం ప్రకారం.. విశ్రంత ఐఎఎస్ అధికారి దీపక్‌ను అభ్యంతరాల పరిశీలనకు నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం.. అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చతూ తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది.