పోస్టాఫీస్‌లో ప‌ట్టుబ‌డిన‌ రూ.21కోట్ల డ్ర‌గ్స్‌..

బెంగ‌ళూరు (CLiC2NEWS): విమానాశ్ర‌యాల్లో అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం చూశాం. దేశాల మ‌ధ్య కాని, రాష్ట్రాల మ‌ధ్య‌కాని మాద‌క ద్ర‌వ్యాలను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌పుడు అధికారులు వాటిని గుర్తించేవారు. ఈశారి ఏకంగా పోస్టాఫీస్‌లో పెద్ద‌ మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగ‌ళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫారిన్ పోస్ట్ ఆఫీస్‌లో రూ. 21 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు.

బెంగ‌ళూరులోని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వ‌ద్ద నార్కొటిక్స్ కంట్రోల్ యూనిట్ క‌స్ట‌మ్స్ అధికారుల‌తో క‌లిసి త‌నిఖీలు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో దాదాపు 606 డ్ర‌గ్స్ పార్శిళ్ల‌ను గుర్తించారు. వీటిని అమెరికా, బెల్జియం, యుకె, థాయ్‌లాండ్‌, నెద‌ర్లాండ్స్ వంటి దేశాల నుండి అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్లు స‌మాచారం. స్వాధీనం చేసుకున్న డ్ర‌గ్స్‌లో హైడ్రో గంజాయి, ఎల్ ఎస్‌డి, ఎండిఎంఎ క్రిస్టల్స్ త‌దిత‌ర మ‌త్తు ప‌దార్థాలు ఉన్నాయని అధికారులు వెల్ల‌డించారు. వీటిని ఇండియ‌న్ పోస్ట‌ల్ స‌ర్వీస్‌ ద్వారా దిగుమ‌తి చేసుకొని బెంగ‌ళూరులో అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించనున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.