ఎపిలో రూ.65 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సిద్దం
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జి ముందుకు వచ్చింది. సోమవారం రూ.40వేల కోట్లతో టాటా పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, టాటాగ్రూప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ మరో సంస్థ ఎపిలో రూ.65వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సిఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇవాళ రాష్ట్రాభివృద్ధిలో చాలా ముఖ్యమైన రోజని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లకు గాను రూ.65వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని .. ఒక్కో బయోగ్యాస్ ప్లాంట్‌కు రూ.131 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో 2.5లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి కావాలని..దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు.
గత నెలలో ముంబయి వెళ్లిన మంత్రి లోకేష్ రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని కలిశారు. గ్రీన్ ఎనర్జి, క్లీన్ ఎనర్జి రంగాలకు ఎపి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారికి లోకేష్ వివరించారు.