దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు.. గ్రామస్థుల ఆందోళనతో సర్కార్ నిర్ణయం
దిలావర్‌పూర్ (CLiC2NEWS): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్-గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు మంత్రి సీతక్క స్థానికులతో ఫోన్‌లో మాట్లాడి విషయాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆ గ్రామ ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. మహిళలు సైతం అందోళనలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఒక రోజంతా బైఠాయించారు. పరిశ్రమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి మద్దతుగా దిలావర్‌పూర్, గుండంపెల్లి, సముందర్‌పెల్లి, టెంబుర్ని గ్రామాల్లో స్వచ్చందంగా దుకాణాలు మూసివేశారు. మహిళలు దిలావర్‌పూర్ పోలీస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లురువ్వడంతో కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.
అనంతరం నిర్మల్ కలెక్టర్ , ఎస్ పి రైతుల ప్రతినిధులతో గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ తరలింపు, ఆందోళనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, ఆందోళనకు మద్దతిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ల రద్దు వంటి అంశాలపై అధికారులు సానుకూలత వంటి డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం తరపునుండి సానుకూలత రావడంతో ఆందోళన విరమించడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దిలావర్‌పూర్ మండలంలో స్థానికుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ నుండి భూమిని సేకరించేందుకు ముందు యాజమాన్యం నీరు, వ్యవసాయ భూములు కలుషితం కాకుండా పరిశ్రమ నిర్మాణం జరుగుతుందని .. 40 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి రోజుకు 12 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఇది నాలుగు లక్షల లీటర్ల ఇథనాల్‌ను తయారు చేసి, ఎనిమిది లక్షల లీటర్ల వ్యర్థాలను తిరిగి ప్రాజెక్టులోకి విడుదల చేస్తుందని .. దీంతో వ్యవసాయ భూములు పనికిరాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో మంగళవారం నిర్మాల్-భైంసా రోడ్డులో రైతులు వంటా వార్పు కార్యాక్రమాన్ని చేపట్టారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట మరోసారి నిరసన చేపట్టి.. పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.