మూడు రోజులు ప్ర‌జాపాల‌న ఉత్స‌వాలు.. సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఈ నెల 7,8,9 తేదీల్లో ప్ర‌జాపాల‌న ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. న‌గర‌లోని స‌చివాల‌య ప్రాంగ‌ణం, నెక్లెస్ రోడ్డులో వేడుక‌లు పండుగ వాతావ‌ర‌ణంలో జ‌రుగుతాయని.. ఈ వేడుకల‌కు విప‌క్ష నేత‌ల‌కు ఆహ్వానం పంపిస్తామ‌ని సిఎం తెలిపారు. ఈ నెల 9 నుండి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. గురువారం మంత్రుల‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి ఇందిర‌మ్మ‌ ఇళ్ల ప‌థ‌కం యాప్‌ను ఆవిష్క‌రించారు. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిర‌మ్మ కాల‌నీ లేని ఊరు లేద‌న్నారు. రూ.10వేల‌తో ప్రారంభ‌మైన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం నేడు రూ.5ల‌క్ష‌ల‌కు చేరింద‌ని సిఎం అన్నారు.

ఈ నెల 9 నుండి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని సిఎం తెలిపారు. అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత సీటు ఖాళీగా ఉండ‌టం రాష్ట్రానికి మంచిది కాద‌ని.. బిఆర్ఎస్ అధ్య‌క్షుడు కెసిఆర్ అసెంబ్లీకి వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాల‌ని కోరారు. మీ అనుభ‌వం, చ‌తుర‌తను ఉప‌యోగించి పాల‌క‌ప‌క్షాన‌కి సూచ‌న‌లు ఇవ్వాల‌న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు సిఎంగా ఉన్న‌పుడు .. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేవార‌ని , అదేవిధంగా వైఎస్ ఆర్ సిఎంగా ఉన్న‌పుడు చంద్ర‌బాబు కూడా అదే త‌ర‌హాలో ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేసేవార‌ని గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికార విప‌క్షాలు.. భార‌త్‌-పాకిస్తాన్ త‌ర‌హాగా ఎందుకు మార్చార‌ని ఈ సంద‌ర్బంగా సిఎం ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your email address will not be published.