కౌంటింగ్‌ను ఆపేయండి.. సుప్రీంకు వెళ్తాం: డోనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఎన్నికల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతున్నదని, తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఎన్నికల ఫలితాల్లో మోసం జరుగుతోందని ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయన ఇవాళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
‘ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారు. నేను సుప్రీం కోర్టుకు వెళ్తున్నా.. ఎన్నికల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలి.. ఈ ఎన్నికలను మేమే గెలవబోతున్నాం.. నిజంగా చెబుతున్నా.. మేమే గెలిచాం.. చట్టాన్ని సరిగ్గా ఉపయోగించి ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను ఆపేయాలని కోరుతున్నాం..’ అంటూ ట్రంప్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం వస్తున్న ఫలితాల ఆధారంగా బైడెన్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ కూడా మ్యాజిక్ మార్క్‌కు దగ్గరగా సమీపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ 237, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నారు. కానీ ఇంకా కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇది అత్యంత విషాదకర సమయమని, ఈ ఎన్నికలను తామే గెలవబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. కీలకమైన ఫ్లోరిడాలో తామే గెలిచామని ట్రంప్ చెప్పారు. ఓహయా, టెక్సాస్ లో గెలిచామన్నారు.
జార్జియాలో కూడా గెలిచామని, అక్కడ 2.25 శాతం అధిక ఓట్లను గెలిచినట్లు ఆయన చెప్పారు. ప్రత్యర్థులను మనల్ని అందుకునే అవకాశం లేదన్నారు. నార్త్ కరోలినాలోనూ 1.5 శాతం ఆధిక్యం ఉన్నట్లు తెలిపారు. ఆరిజోనాలోనూ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ఇక అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలోనూ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. మిచిగన్ రాష్ట్రంలోనూ భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తెలిపారు. పెన్సిల్వేనియాలో కూడా భారీ మెజారిటీతో గెలవనున్నట్లు ట్రంప్ చెప్పారు.