ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తాం.. ఇంటర్ బోర్డు కార్యదర్శి
అమరావతి (CLiC2NEWS): ఎపిలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను మాత్రమే బోర్డు నిర్వహించేలా ఇంటర్ విద్యలో మార్పులు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా మీడియా సమావేశంలో తెలిపారు. ఇంటర్ విద్యాలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుండి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చాలాకాలం నుండి ఇంటర్ విద్యాలో సంస్కరణలు జరగలేదని.. జాతీయ కరికులం చట్టాన్నిఅనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తీసుకురానున్నారు. దీనిలో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తామన్నారు. ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందన్నారు.
2024-25 నుండి పదో తరగతిలో ఎన్సిఇ ఆర్టి పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టారని.. 2025-26 నుండి ఇంటర్లో కూడా ఎన్సిఇఆర్టి పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామన్నారు. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారని.. దీంతో నీట్, జెఇఇ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందన్నారు. ఈనెల 26లోగా ఇంటర్ విద్యాలో సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలన్నారు.