నగరంలో కిడ్నీ రాకెట్.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని సరూర్నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది దళారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. గత ఆరు నెలల నుండి ఆస్పత్రిలో ఇది నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతనితోపాటు మరికొంత మంది ప్రమేయం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆస్పత్రి నిర్వాహకుడు సమంత్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్లోని సరూర్నగర్ పరిధిలో ఉన్న అలకనంద ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా.. వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. ఆస్పత్రిలో నలుగురిని పోలీసులు గుర్తించారు. ఈ నెల 17వ తేదీన కర్ణాటక, తమిళనాడు కు చెందిన నలుగురు ఆస్పత్రిలో చేరారు. వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీయించుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. వీరికి కిడ్నీ మార్పిడి జరిగిందా.. లేదా తెలుసుకునేందుకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అలకనంద ఆస్పత్రిని సీజ్ చేశారు.
అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరగడం నిజమేనని వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఉస్మానియా ఆస్పత్రి మాజి సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కిమిటి ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన వారు ఆర్ధిక కారణాలతో కిడ్నీలు విక్రయించినట్లు ఒప్పుకున్నట్లు డిఎంఇ వాణి వెల్లడించారు.