ఎస్‌సి వర్గీకరణ, కులగణన.. నాజీవితంలో ఫిబ్రవరి 4 గుర్తుండి పోతుంది
హైదరాబాద్ (CLiC2NEWS): ఎస్‌సి వర్గీకరణ, కులగణన నివేదికలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే. ఎస్‌సి వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని , దీని కోసం ఏకసభ్య కమిషన్ వేశామని అసెంబ్లీలో సిఎం ప్రకటన చేశారు. కమిషన్ పలు జిల్లాల్లో పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. నేరుగా ప్రజలను కలుసుకుని విజ్ఞప్తులు సేకరించింది. వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసింది. కులగణన, ఎస్ సి వర్గీకరణ.. తన రాజకీయ జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలని, 2025 ఫిబ్రవరి 4వ తేదీ ప్రత్యేకం గా గుర్తుండి పోతుందని సిఎం అన్నారు.
ఎందరో సిఎంలకు రాని అవకాశం తనకు వచ్చిందని.. చాలా రాజకీయ పార్టీలు ఎస్‌సి వర్గీకరణ అంశాన్ని ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపించలేదని సిఎం అన్నారు. ఈ వర్గీకరణ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం ద్వారా తరతరాలుగా నిర్లక్ష్యానికి , దోపిడికీ గురైన వారికి న్యాయం చేయాలని సంకల్పించినట్లు సిఎం తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.
ఎస్ సి వర్గీకరణపై కమిషన్ 82 రోజులలో నివేదికను అందించింది. 15 శాతం ఎస్‌సి రిజర్వేషన్లు 3 గ్రూపులకు పంచుతూ సిఫారసు చేసింది. ఎస్‌సిలలో మొత్తం 59 ఉప కులాలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది.
గ్రూప్ -1లోని ఉపకులాలకు 1% రిజర్వేషన్ (జనాభా 3.288%)
గ్రూప్ -2లోని 18 ఉప కులాలకు 9% రిజర్వేషన్ (జనాభా 62.74%), గ్రూప్- 3 లోని 26 ఉప కులాలకు 5% రిజర్వేషన్ (33.963%) కల్పించాలని వర్గీకరణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది.
30, 40 ఏళ్ల నాటి ఆకాంక్ష నేడు సాకారం అవుతోందని.. ఎస్ సి వర్గీకరణ వలన కొంతమందిలో భయం అభద్రతా భావం కలుగుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దీని వలన ఎవరికి ఎటువంటి విఘత కలగదని.. సామాజిక ఫలాలు అందరికీ అందాలనేది కాంగ్రెస్ పార్టీ తపన అన్నారు.