వారం రోజుల్లోగా ఆయుధాల్ని సరెండర్ చేయాలి: గవర్నర్ విజ్ఞప్తి

ఇంఫాల్ (CLiC2NEWS): మణిపుర్‌లో దాదాపు రెండేళ్ల నుండి జాతుల మధ్య వైరంతో రాష్ట్రమంతా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అధికారాలన్నిటినీ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజగా గవర్నర్ అజయ్ కుమార్ మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించే లక్ష్యంతో కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను వారం రోజుల్లోగా అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి శిక్షలు ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు.
మణిపుర్‌లోని లోయ, కొండ ప్రాంతాల్లోని ప్రజలు దాదాపు 20 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాంతి, మత సామరస్యతను దెబ్బతీసే దురదృష్టకర ఘటనలతో మణిపుర్ ప్రజలు కల్లోల వాతావరణంలో నివసిస్తున్నారు. సాధారణ స్తితిని పునరుద్ధరించేందుకు ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా అన్ని వర్గాలు వైరాన్ని వీడి, శాంతి భద్రతలను కాపాడేందుకు ముందుకు రావాలని గవర్నర్ ప్రకటన విడుదల చేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందరం కలిసి ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని పునర్నించడానికి ముందుకు రావాలని పేర్కొన్నారు.