తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల (CLiC2NEWS): తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సీత, లక్ష్మణ, ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటి ఇఒ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
క్రీ.శ, 1468లో సాళువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి.. తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ. 15 శతాబ్దానికి చెందిన తాళ్లపాక అన్నమాచార్యులు తిరులమ తెప్పోత్సవాల గురించి గొప్పగా కీర్తించారు. తెప్పోత్సవాలలో భాగంగా మొదటి రోజు సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి .. రెండో రోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా మూడోరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.