ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం.. నిర్మాత దిల్ రాజు

హైదరాబాద్ (CLiC2NEWS): ఏప్రిల్ నెలలో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గద్దర్ అవార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయని తాజాగా దిల్ రాజు మీడియా సమావేశంలో తెలిపారు.
పైడి జయరాజ్, కాంతారావు పేరుతో గౌరవ పురస్కారాలు అందించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. తెలుగతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ సినిమాలకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నామని తెలిపారు. 2014 నుండి 2023 డిసెంబర్ వరకూ విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.