ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం.. విద్యార్థులకు తప్పిన ముప్పు

ఇచ్చోడ (CLiC2NEWS): ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పాఠశాలలో ఉన్న నీటిలో దుండగులు విషం కలిపినట్లు సమాచారం. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారణంగా విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.
వరుసగా వచ్చిన సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలకు వచ్చి చూసిన సిబ్బందికి వంటగదికి ఉన్న తాళాలు పగలగొట్టినట్లు గమనించారు. గదిలో ఉన్న ఒక బకెట్‌లో నీరు తెలుపు రంగులో ఉండటం.. వంట పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ గమనించగా పరుగుల మందుల డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులోనూ పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషప్రయోగం ధర్మపురికి చెందిన వ్యక్తే చేసి ఉంటాడనే అనుమానంతో దర్యాప్తు ప్రారంభించారు.
విష ప్రయోగ ఘటన పై దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన సోయం కిస్టును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే నీటిలో పురుగుల మందు కలిపినట్లు అంగీకరించారు. కుటుంబ కలహాల కారణంగా గత కొంత కాలంగా నిందితుడు మనాసికంగా ఇబ్బంది పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.