అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుందో 2 వారాల ముందే చెప్పిన బెర్నీ

వాషింగ్టన్ : ప‌్రపంచమంతటా అ్రగరాజ్యధినేత ఎవరనే ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతూ..మ్యాజిక్ ఫిగర్ 270కి అత్యంత సమీపంగా ఉన్నారు. ట్రంప్‌కు ఇప్పటి వరకు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం జార్జియాలో నువ్వా-నేనా అన్న పోరు సాగుతోంది. అయితే అక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అడ్డుకోవడానికి ట్రంప్ న్యాయపోరాటానికి దిగనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో డెమోక్రాటిక్ సేనేటర్ బెర్నీ సాండర్స్ ఈసారి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో రెండు వారాల ముందే చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బుధ, గురవారాల్లో సంఘటనలు పరిశీలిస్తే… ఆయన వ్యాఖ్యలు నిజమోనన్న సందేహం కలగకమానదు. అక్టోబర్‌లో జిమ్మి ఫాలన్‌టునైట్ షోలో భాగంగా శాండర్స్‌ను ఇంటర్వ్యూ చేయగా.. ఈ ఎన్నికల ఫలితాలను ఆయన అంచనా వేశారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటాయని..ఫలితంగా కౌంటింగ్ ప్రక్రియ ముగియడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు.
పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిస్ వంటి రాష్ట్రాల్లో మెయిల్-ఇన్ బ్యాలెట్లు భారీ మొత్తంలో నమోదవుతాయని, ఫ్లోరిడా లేదా వెర్కోంట్ వంటి రాష్ట్రాల మాదిరిగా కాకుండా, వేరే ఇతర కారణాల వల్ల, ఎన్నికల రోజు వెంటనే ఆ బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం ప్రారంభించలేరని అన్నారు. ఈ ఏడాది ఎక్కువ రాష్ట్రాల్లో, మిలియన్ల కొద్దీ మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఉండబోతున్నాయని, రిపబ్లికన్లు మాత్రం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తారని, ఇక ఎన్నికలు జరిగే నాడు రాత్రి 10 గంటల ప్రాంతంలో ట్రంప్ పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విజయం సాధిస్తారని, దాంతో వెంటనే టివీల్లో కనిపించి నన్ను మరోసారి ఎన్నుకున్నందుకు అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతాడని, ఇకా అంతా ముగిసిందని, ఇదొక మంచి రోజు అంటాడని శాండర్స్ చెప్పుకొచ్చారు. శాండర్స్ ఈ సంవత్సరం ప్రారంభంలో అధ్యక్ష పదవి పోటీ నుండి వైదొలిగిన సంగతి విదితమే.