పాక్ పౌరులు భారత్లోనే ఉంటే మూడేళ్ల జైలు.. రూ.3లక్షల జరిమానా!

ఢిల్లీ (CLiC2NEWS): పహల్గాం ఉగ్రదాడి ఘటన అనంతరం భారత ప్రభుత్వం ఉగ్రవాదుల ఆచూకీ కోసం కఠిన చర్యలకు ఉపక్రమించింది. భారత్లో ఉన్న పాక్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా ఇక్కడే ఉంటే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4 నుండి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు తీరిపోయినా ఇక్కడే ఉండటం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానా విధించనున్నట్లు సమాచారం.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రాలను కోరారు. సార్క్ వీసాల కింద భారత్లో ఉన్న పాక్ పౌరులు ఏప్రిల్ 26లోపు స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువునిచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో 509 మంది పాకస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు గుండా పాక్కు వెళ్లినట్లు సమాచారం. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.