తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి గొప్ప అనుభూతి: మిస్ ఇండియా

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సంస్కృతి , అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంటాయని, హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు నగరంలో జరగనున్న నేపథ్యంలో హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, మిస్ వరల్డ్ సిఇఒ జూలియా, మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా, పటేల్ రమేశ్ రెడ్డి, జయేశ్ రంజన్, సోనూసూద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నందిని గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతి సారి తనకు గొప్ప అనుభూతి కలుగుతుందన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ద చెందుతున్న నగరమని, ఇక్కడి ప్రజలు ప్రేమను పంచుతున్నారన్నారు. హైదరాబాది బిర్యాని నుండి ఇరానీ చాయ్ వరకు ఆహారం అద్బుతంగా ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక గొప్ప లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు వందకు పైగా దేశాల నుండి అందాల భామలు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరానికి వచ్చే వారికి స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.