బిఇ/ బిటెక్తో ఇండియన్ ఆర్మీలో లెప్ట్నెంట్ హోదాలో పోస్టులు..

Indian Army: బిఇ/ బిటెక్ విద్యార్హతతో ఇండియన్ ఆర్మీలో రూ.లక్ష వేతనం అందుకునే అవకాశం. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు, చివరి ఏడాది చదువుతున్న వారి నుండి టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టిజిసి)ల్లోకి చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బిటెక్ మార్కుల మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూలకు పిలుస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ ఎస్బి) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.
అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మే 29వ తేదీ వరకు పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి 20 నుండి 27 ఏళ్ల లోపు ఉండాలి. జనవరి 2, 1999 నుండి జనవరి 1, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఎంపికైన వారికి శిక్షణ సమయంలో స్టైపెండ్ చెల్లిస్తారు. ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం లెప్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుండి రూ.లక్షకు పైగా వేతనం అందుతుంది. లెవల్-10 రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలిటరీ సర్వీస్ పే అందుతాయి. వీటికి తోడు డిఎ, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. దీంతో మొదటి నెల నుండే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.
సర్వీస్ సెలక్షన్ బోర్డు , బెంగళూరు కార్యాలయంలో ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ముందుగా స్టేజ్-1 స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-2 పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు హాజరైన వారికి ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు https://joinindianarmy.nic.in/ వెబ్సైట్ చూడగలరు.