స్టే విధించిన కేసుల్లో 6 నెల‌ల్లో నిర్ణ‌యం: సుప్రీం

ప్రజాప్రతినిధుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అన్ని కోర్టులూ పాటించాల‌న్న స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం

 

న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధుల కేసులపై స్టే విధించిన చోట్ల 6 నెలల్లోపు నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ఆ త‌ర్వాత స్టే చెల్లుబాటు కాద‌న్న ఆదేశాల‌ను అన్ని కోర్టులూ పాటించాలంటూ జస్టిస్ ఎన్‌.వి. ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం మ‌ధ్యంత‌ర ఆదేశాలు జారీ చేసింది. కేసుల విచారణలో అనవసర వాయిదాలు నిరోధించాలని సూచించింది. సాక్షుల రక్షణ పథకం 2018 ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని.. సాక్షుల భద్రతాంశాలపై ట్రయల్‌ కోర్టులే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దోషులుగా తేలిన నేతలపై జీవితకాలం నిషేధం విధించాలన్న మధ్యంతర పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో వారం గడువు ఇచ్చింది. ఈ అంశంపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

దేశ వ్యాప్తంగా అయా న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్ల అమలు, సమన్ల అందజేతకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారుల నియామకం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోని పెండింగ్ కేసుల వివరాలు తదుపరి విచారణ తేదీ నాటికి సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లా కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ గది ఏర్పాటుకు అయ్యే ఖర్చు భరించే అంశంపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.