మెజారిటీతో గెలవబోతున్నాం: బైడెన్

విల్మింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయపు అంచులకు చేరుకున్నట్లే కనబడుతోంది. విజేత ఎవరో నేడు దాదాపు ఖరారయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి. పెన్సిల్వేనియాలో బైడెన్ భారీ ఆధిక్యం దిశగా వెళ్తున్నారు. బైడెన్ 253, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల రేసులో తాము గెలవబోతున్నట్లు ప్రకటించారు. స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నామని, దేశం తమ వెంటే ఉందని ఆయన అన్నారు. తమ పార్టీకి సుమారు 7.5 కోట్ల ఓట్లు పోలయ్యాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఏ అభ్యర్థికి కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదని బైడెన్ అన్నారు. 300 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లక్ష్యంగా గెలవబోతున్నట్లు ఆయన చెప్పారు. సంప్రదాయబద్ధంగా రిపబ్లికన్లకు చెందిన ఆరిజోనా, జార్జియా రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకోనున్నట్లు బైడెన్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం ఉంచాలని, 244 ఏళ్ల నుంచి ఆ విషయాన్ని నిరూపించామన్నారు. మీ ఓట్లు అన్నీ లెక్కపెడుతారన్నారు. విల్మింగ్టన్‌లోని చేజ్ సెంటర్ నుంచి బైడెన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.