బిజెపి, కాంగ్రెస్‌ది బుర‌ద రాజ‌కీయం

క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉన్నాం : కేటీఆర్‌

హైదరాబాద్: వ‌ర‌ద సాయం పంపిణీని కొంత మంది రాజ‌కీయం చేస్తున్నార‌ని తెలంగాణ‌ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ… విజ్ఞ‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యంలో బిజెపి, కాంగ్రెస్ నేత‌లు బుర‌ద రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చిల్లరమల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో భారీవర్షం, వరదలు ప్రజల్ని కష్టాల్లోకి నెడితే, ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు సహకరించాల్సింది పోయి బీజేపీ నేతలు, ఆపార్టీ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు, ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విపక్షాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారం కాకూడదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నుంచి ఎలాంటి సహాయం అందకున్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 800 మందితో డీఆర్‌ఎఫ్‌ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనతో పాటు ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల గోడును ఆలకించారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత సీఎం కేసీఆర్‌కు నివేదించడంతో తక్షణసాయం కింద సీఎం కేసీఆర్‌ రూ. 550 కోట్లు కేటాయించారన్నారు. బాధితులకు రూ. 10 వేల చొప్పున వరద సాయం ప్రకటించారన్నారు. 4.30 లక్షలకుపైగా కుటుంబాలకు వరదసాయం అందించినట్లు తెలిపారు. దసరా లోపే వరద సాయం అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇప్పటివరకు వరదసాయం అందిన బాధితుల వివరాలను సేకరించాం. వాస్తవంగా నష్టపోయిన వారికే వరద సాయం అందించాం. 920 బృందాలను ఏర్పాటు చేసి వరద సాయం అందించినట్లు తెలిపారు. ఒక్కరోజే లక్ష మందికి సాయం పంపిణీ చేశామన్నారు. తాము సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ బురద రాజకీయం చేశాయని మండిపడ్డారు. అధికారుల దగ్గరకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నరన్నారు. పరిహారం ఇచ్చిన వారితో కూడా రోడ్డుపై ధర్నాలు చేయించారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు అవసరమైతే మరో రూ. 100 కోట్లు కేటాయించేందుకు సిద్ధమని తెలిపారు. కర్ణాటక, గుజరాత్‌పై ఉన్న ప్రేమ ప్రధానికి తెలంగాణపై ఎందుకు లేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. బెంగళూరుకు మూడు రోజుల్లో సహాయం ప్రకటించిన ప్రధాని మోదీ.. హైదరాబాద్‌ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్‌ లేఖ రాసినా ఫలితం లేదన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే స్వయంగా వెళ్లి నిధులు విడుదల చేసిన ప్రధాని హైదరాబాద్‌ విషయంలో ఎందుకు వివక్ష చూపిస్తున్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.