పండిట్ జస్రాజ్ ఇక లేరు
పండిట్ జస్రాజ్ ఇక లేరు
న్యూయార్క్/ న్యూఢిల్లీ: ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విధ్వాంసులు పండిట్ జస్రాజ్ (90) సోమవారం కన్నుమూశారు. వయోభారంతో అమెరికన్ నగరం న్యూయార్క్లో జస్రాజ్ తుదిశ్వాస విడిచారు. ఆయన తన సుదీర్ఘ కెరీర్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. జస్రాజ్ హర్యానాలోని హిస్సార్లో 1930 జనవరి 28న జన్మించారు. తన తండ్రి పండిట్ మోతీరామ్ తన తొలి గురువు కావడంతో జస్రాజ్ ఏటా ఆయన జ్ఞాపకార్ధం హైదరాబాద్లో గత 30 ఏళ్లుగా పండిట్ మోతీరామ్ సంగీత్ సమారోహ్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయని సాధనా సర్గమ్తో పాటు సంజీవ్ అభయంకర్, సుమన్ ఘోష్, తృప్తి ముఖర్జీ, కళా రామ్నాథ్ల వంటి ఎందరినో ఆయన గాయకులుగా తీర్చిదిద్దారు. భారత సంగీత దిగ్గజం ఇక లేరని ఆయన కుమార్తె దుర్గా జస్రాజ్ ప్రకటించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
పండిట్ జస్రాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మృతి తనను ఎంతో విషాదంలో ముంచెత్తిందని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 8 దశాబ్దాలకు పైగా సంగీత సామ్రాజాన్ని సుసంపన్నం చేసిన పద్మ విభూషణుడు జస్రాజ్ అని గుర్తుచేసుకున్నారు. జస్రాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.