వ్యాపారంలోకి మహేంద్ర సింగ్‌ ధోని

రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఓ వైపు సిరుల పంటతోపాటు, అత్యధిక పోషణ విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు ‘ కడక్‌నాథ్‌ ‘ పెంపకం పై ధోని దృష్టి పెట్టారు. రాంచీలోని ఫాంహౌస్‌ లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పే దిశగా మహీ టీం ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌ గిరిజన రైతు వినోద్‌ మెండాతో వీరు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పటికే ధోని బృందం ఆర్డర్‌ చేసిన 2 వేల కోడిపిల్లలు, వచ్చే డిసెంబరు 15 న రాంచీకి డెలివరీ కానున్నట్లు సమాచారం.
ఈ విషయమై మధ్యప్రదేశ్‌లోని జబువాలో ఉన్న కడక్‌నాథ్‌ ముర్గా రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఐఎస్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోని తమను సంప్రదించారని, ఆ సమయంలో తమ వద్ద కోడిపిల్లలు అందుబాటులో లేకపోవడంతో రైతు నంబరును ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాలైన ఝూబువా, అలీరాజ్‌పూర్‌ పరిసరాల్లో భీల్‌, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి నల్ల కోళ్లను పెంచుతున్నారు. ప్రొటీన్ల శాతం ఎక్కువ. కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ. ఐరన్‌ శాతం మామూలు కోళ్ల కంటే పది శాతం ఎక్కువ ఉంటుందట. ఇక ఈ కోళ్ల చర్మం, మాంసంతోపాటు రక్తం కూడా నలుగు రంగులోనే ఉండటం విశేషం ! వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, పెరిగే కొద్దీ నలుపు రంగులోకి మారుతాయి. అధిక రోగనిరోధక శక్తి గల కడక్‌నాథ్‌ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి, గుడ్డు ధర రూ.40, 50 పైగానే ఉంటుందట.
సిరులతోపాటు పోషకాలనందించే ఈ నల్లకోళ్ల పౌల్ట్రీని ధోని నెలకొల్పనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని, ప్రస్తుతం ఐపిఎల్‌ టీం సిఎస్‌కే కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా తన ఫాంహౌజ్‌లో కుటుంబంతో సమయం గడిపే ధోని, ఇప్పుడు అక్కడే పౌల్ట్రీని నెలకొల్పనున్నారు.

Leave A Reply

Your email address will not be published.