`గ్రేటర్`లో కెసిఆర్ ప్రచారం? కెటిఆర్ రోడ్ షోలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వేడి మొదలైంది. రేపటితో గ్రేటర్‌లో నామినేషన్లు ముగియనున్నాయి.. ఓవైపు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే డివిజన్ల వారిగా ఇంఛార్జ్‌లు కూడా ప్రకటించి.. పార్టీ శ్రేణులను కదిలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి గ్రేటర్ పరిధిలో సీఎం కేసీఆర్ ఓ ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, గతంలో మాదిరిగానే.. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. విస్తృతంగా ప్రచారంలో పాల్గొననున్నారు.. ఈ నెల 22వ తేదీ నుండి గ్రేటర్‌లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు కేటీఆర్… కుత్బుల్లాపూర్ నుండి కేటీఆర్ రోడ్డు షోలు ప్రారంభం అవుతాయని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.. ఇక, ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారని.. ఈ సభకు గులాబీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా గ్రేటర్ లో నామినేషన్ల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. నిన్నటి రోజున కేవలం 20 నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. నామినేషన్ల ప్రక్రియకు రేపు ఆఖరు తేదీ కావడంతో ఈరోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది. గ్రేటర్ పరిధిలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లోకి అనుమతి ఉంటుంది. ఈరోజు రేపు పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నవంబర్ 21 వ తేదీన నామినేషన్ల పరిశీలనా, 22 న ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 1 వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉండగా, డిసెంబర్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.