గ్రేట‌ర్ ఫైట్‌: బిజెపికి జ‌న‌సేన మ‌ద్ద‌తు

బీజేపీకి మద్దతుగా నిలవాలి.. జనసైనికులకు పవన్ పిలుపు

హైదరాబాద్: ఎపి, తెలంగాణ‌లో బిజెపితో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప్ర‌ధాని మోడీ నాయ‌క‌త్వంలో హైద‌రాబాద్ విశ్వ‌న‌గరంగా రూపు దిద్దుకొంటోంద‌న్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని జనసైనికులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. నగరంలోని నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…  2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు.

దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదన్నారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదన్నారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అంటే నాకు అభిమానం.. ఎందరో జనసేన నాయకులు ఇక్కడ ఉన్నారు.. హైదరాబాద్‌లో ప్రాంతీయత, మతాలు చూడొద్దని.. ప్రజలకు రక్షణ బీజేపీతోనే సాధ్యం అన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న జనసేనాని.. తెలంగాణలో జనసేన, బీజేపీ రోడ్ మ్యాప్ భవిష్యత్ లో ప్రకటిస్తామన్నారు. ఎన్నికల్లో జనసేన ఉపసంహరించుకొంటుంది.. బీజేపీకి పూర్తి మద్దతు అని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.