తులజ గానం సుస్వర రాగ గంగా ప్రవాహం..
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వ మవుతున్నదో .. అంటాడు ఒక సినీ కవి.. అదే విధంగా ఏ స్వరం లో చేరితే రాగం శ్రావ్యంగా వినిపిస్తుందో అనిపిస్తుంది కొందరి గాత్రం వింటే. మరి అలంటి వారిలో తులజ మేళ్లచెరుఫు స్వరం ఎందరినో అలరిస్తుంది. అసలు ఆమె ఎవరు, ఆ స్వర ప్రాధాన్యత ఏమిటో మనం తెలుసుకుందాం . పురాణ కాలంలో అభిమన్యుడు, ప్రహ్లాదుడు గర్భంలో ఉండగానే జ్ఞానాన్ని పొందారు. అదే విధంగా తులజ మేళ్లచెరుఫు కూడా పుట్టగానే సుస్వరాలు గుర్తించ గలుగుతుంది. అమ్మ ఒడి లోనే రాగాలపై మమకారం పెంచుకుంది.
1994లో జన్మించిన ఈ గాయని తన ఐదవ ఏట ప్రముఖ సంగీత విద్వాన్సుడు నూకల చిన సత్యనారాయణ ఇంటికి వచ్చి రాగాలను ఆలపిస్తుంటే అలవోకగా రాగాలను గుర్తు పట్టగలిగారు. అందుకు కారణం లేక పోలేదు. సుమారు మూడు తరాలుగా వారి కుటుంబంలో సంగీతంలో నిష్ణాతులు. తులజ మేళ్లచెరుఫు తండ్రి ఎంవిఎస్ఎస్ నాగరాజ కుమార్, తల్లి సత్యమణి. తల్లి వీణలోనూ, గాత్రంలోను నిపుణురాలు. ఆకాశవాణిలో వీణలో బి.హై గ్రేడ్ ఆర్టిస్ట్. అంతే కాదు తల్లి తోబుట్టువులు బండి శ్యామల బాల సుబ్రహ్మణ్యం, సి.వి.సుబ్బలక్ష్మి కూడా ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్టులే. అంతేకాదండోయ్ తాతయ్య (తల్లి తండ్రి) శిష్ట సూర్యనారాయణ మూర్తి అమలాపురం సమీపం లోని బుచ్చమ్మ అగ్రహారంలో వీణా విద్వాన్. మరి ఇంతటి ఘాన వారసత్వం తులజ మేళ్లచెరుఫుకు వుంది.
బి.కామ్ హైదరాబాద్ భద్రక కళాశాలలో పూర్తి చేసి తెలుగు విశ్వవిద్యాలంలో గాత్రంలో స్నాతకోత్తర పట్టా పుచ్చుకుంది. తరతరాలుగా వస్తున్న సంగీత వారసత్వాన్ని దశదిశలా చాటాలన్నది ఆమె తపన ఈ నేపథ్యంలో దేశ, విదేశాల్లో ఎన్నెన్నో కర్ణాటక సంగీత కచేరీలు చేసారు కరోనా వలన ఇంటిలో వున్నా సందర్భంలో ముఖ పుస్తకం ద్వారా ప్రపంచ వ్యాప్త కార్యక్రమాలలో పాల్గొని ఎందరినో ఆకట్టుకున్నారుత్యాగరాయ, రామదాసు, ముత్తుస్వామి, నారాయణ దీక్షితుల కీర్తనలు ఎంతో శ్రావ్యముగా ఆలపించే తులజ మేళ్లచెరుఫు భవిష్యత్తులో సంగీతం లో పరిశోధన చేయాలని, ఈ తరం ఔత్సాహికులకు సంగీతం నేర్పించి తనవంతుగా కృషి చేయాలని, ఆమె కోరికలు వాస్తవ రూపం దాల్చాలని, భవిష్యత్తులో ఒక మంచి సంగీత నిష్ణాతురాలిగా, గురువుగా ఎదగాలని, ప్రపంచం అరచేతిలోకి వచ్చిన నేపధ్యంలో దేశ విదేశాల్లో వుండే సంగీత ప్రియులకు సేవలందించాలని కోరుకుందాం.
-టి.వేదాంత సూరి