`నివర్` తగ్గకముందే పొంచి ఉన్న మరో మూడు తుపాన్లు

అమరావతి: నివర్ తుపానుతో ఎపిలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు నివర్ తుపాను తీవ్రత పూర్తిగా తగ్గకముందే.. మరో మూడు తుపాన్లు రానున్నాయనే వార్త అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. నివర్ తుపాన్ తీవ్రత క్రమంగా తగ్గుతున్నప్పటికీ అది ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది. ఈ తుపాను వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. దీని ప్రభావంతో 24 గంటలలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ మాసంలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని వివరించింది. డిసెంబర్ రెండో తేదీన ఏర్పడే బురేవి తుపాన్ తీవ్ర ప్రభావం చూపనుందని, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమపై ఎక్కవ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ అయిదవ తేదీన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం టకేటి తుపానుగా మారే ఛాన్సు ఉందని చెబుతోంది.