ఢిల్లీలో 1949 తర్వాత మళ్లీ ఇప్పుడే చలిపులి!
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ చలికి గజగజ వణికిపోతోంది. రోజురోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను గజగజా వణికిస్తున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఎప్పుడూ లేనంతగా ప్రజలను అతలాకుతలం చేశాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. నవంబర్ మాసంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 10.2 డిగ్రీలకు పడిపోయినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు కావడం 1949 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1949 నవంబర్‌లో దేశరాజధానిలో ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలకు పడిపోగా, మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.
గతంలో నవంబర్ నెలలో ఢిల్లీలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
- 1938లో అత్యల్పంగా 9.6 డిగ్రీలు
- 1931లో 9 డిగ్రీలు
- 1930లో 8.9 డిగ్రీలు
- 2018లో 13.4 డిగ్రీలు
- 2017, 2016లలో 12.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
సాధారణంగా నవంబర్ నెలలో దేశ రాజధానిలో 12.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి కానీ, సోమవారం అత్యల్పంగా 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ప్రజల్లో వణుకుపుట్టించింది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోవడం నవంబర్ నెలలో ఇది ఎనిమిడోసారి.