8న భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యమం సాగిస్తున్న రైతులు ఈ నెల 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రోజు టోల్‌ ప్లాజాలను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. నేడు (శనివారం) జరుగనున్న చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని రైతు నేత గుర్నామ్‌ సింగ్‌ చదోనీ స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాలను దిగ్బంధిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హరీందర్‌ సింగ్‌ లఖ్‌వాల్‌ తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణపై రైతు నేతలు శుక్రవారం ఢిల్లీ సరిహద్దుల్లోనే సమావేశమై చర్చించారు. అనంతరం వారు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘ఈ నెల 8న భారత్‌ బంద్‌ చేపట్టాలని నిర్ణయించాం. అందులో భాగంగా అన్ని టోల్‌ప్లాజాలను ముట్టడిస్తాం. శనివారం రైతులు కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్‌ సంస్థలకు నిరసన తెలియజేస్తూ వారి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. సోమవారం రైతులకు సంఘీభావంగా క్రీడాకారులు తమ పతకాలను వాపస్‌ ఇస్తార’ని ఉద్యమ కార్యాచరణను హరీందర్‌ వివరించారు. విలేకరుల సమావేశంలో రాజస్థాన్‌, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన రైతు నాయకులు కూడా పాల్గొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రైతు నేతలు డిమాండ్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.