ఎగ్జిట్ పోల్స్ తారుమారు..!
బీజేపీని తక్కువ అంచనా వేశారు!
హైదరాబాద్: అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా `గ్రేటర్` ఓటరు ట్విస్టు ఇచ్చాడు. ఓటరు నాడీని పలు సంస్థలు పట్టుకోలేకపోయాయి. బీహార్ లో లాగే.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల విషయంలో… వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన సర్వే అంచనాలన్నీ తారుమారయ్యాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు సీట్లు కాస్త తగ్గుతాయని పసిగట్టినా… బీజేపీ అనూహ్య దూకుడును, టీఆర్ఎస్ భారీ తగ్గుదలను ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. మరోసారి ఓటర్లు అధికార టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారని.. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి.టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం వాస్తవమైనప్పటికీ.. ప్రత్యర్థి పార్టీ బీజేపీతో పోలిస్తే స్వల్ప ఆధిక్యాన్నే కనబరిచింది.
ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో చూస్తే.. trs కు ఈసారి 78 స్థానాలు(+/-7) వస్తాయని AARA సంస్థ ప్రకటించింది. 82- 96 స్థానాలు వస్తాయని సీపీఎస్ బృందం చెప్పింది. 68- 78 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్, 65- 70 సీట్లు వస్తాయని హెచ్ఎంఆర్, 74 (-7/+3) స్థానాలు వస్తాయని జన్‌కీబాత్, 21 స్థానాలు వస్తాయని ప్రజావెలుగు ప్రకటించాయి. ఈ సర్వేలకు విరుద్ధంగా టీఆర్ఎస్ 55 స్థానాలు గెలుచుకొంది. గత ఎన్నికలతో పోలిస్తే 43 సీట్లు టీఆర్‌ఎ్‌సకు తగ్గాయి. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా టీఆర్‌ఎ్‌సకు ప్రస్తుతం వచ్చిన స్థానాలకు దరిదాపుల్లో ఉండేలా సీట్లు ప్రకటించలేకపోవడం గమనార్హం.
బీజేపీ దూకుడు ను అంచనా వేయలేకపోయారు !
గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యంగా దూసుకొచ్చిన బీజేపీని అంచనా వేయటంలోనూ ఎగ్జిట్ పోల్స్ బోర్లా పడ్డాయి. బీజేపీ కనిష్ఠంగా 12 డివిజన్లు, గరిష్ఠంగా 35 డివిజన్లలో గెలుస్తుందని సర్వే సంస్థలు అంచనావేశాయి. బీజేపీకి 28(+/-5) సీట్లు వస్తాయని ఆరా సంస్థ ప్రకటించగా.. 12- 20 సీట్లు వస్తాయని సీపీఎస్ బృందం, 25- 35 వస్తాయని పీపుల్స్ పల్స్, 27- 31 సీట్లు వస్తాయని హెచ్ఎంఆర్, 31 (+11/-7) సీట్లు వస్తాయని జన్‌కీబాత్, 97 సీట్లు వస్తాయని ప్రజావెలుగు ప్రకటించాయి. కానీ బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. జీహెచ్ఎంసీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇక గత ఎన్నికల్లో 44 సీట్లు గెలుచుకున్న ఎంఐఎం… కనిష్ఠంగా 32 డివిజన్లు, గరిష్ఠంగా 42 స్థానాలు గెల్చుకుంటుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఆరా సంస్థ 41 (+/-5)సీట్లు, సీపీఎస్ 32- 38, పీపుల్స్ పల్స్ 38- 42, హెచ్ఎంఆర్ 35- 40, జన్‌కీబాత్ 40(+3/-1), ప్రజా వెలుగు 27 సీట్లు వస్తాయని ప్రకటించాయి. ఆరా, పీపుల్స్ పల్స్, జన్‌కీ బాత్ అంచనాలకు దగ్గరగా ఎంఐఎం 44 సీట్లు గెలుచుకొంది. కానీ రెండో స్థానం నుంచి అనూహ్యంగా మూడో స్థానానికి పడిపోయింది. ఈ పరిణామాన్ని ఎవరూ అంచనావేయలేక పోయారు.
`గ్రేటర్` కౌంటింగ్.. మినిట్ టూ మినిట్
ఇక కాంగ్రెస్ కు ఆరా సంస్థ 3(+/-3), సీపీఎస్ 3- 5, పీపుల్స్ పల్స్ 1- 5, హెచ్ఎంఆర్ 3- 6, జన్‌కీబాత్- 0, ప్రజావెలుగు 5 సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ కనిష్ఠంగా ఒక డివిజన్లో, గరిష్ఠంగా 6 డివిజన్లలో గెలుస్తుందని పేర్కొన్నాయి. గడిచిన ఎన్నికల్లో సాధించినట్లుగానే కాంగ్రెస్ రెండు డివిజన్లకే పరిమితమైంది. అయితే గత ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ నాలుగో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే సంస్థలు వేసిన అంచనాలు మాత్రం నిజమయ్యాయి.
ఈ మధ్య కాలం లో అటు బీహార్ గాని ఇటు జిహెచ్ ఎంసి గాని సర్వే సంస్థలు ప్రజానాడిని పసిగట్టలేకపోతున్నాయి.. దుబ్బాకలో కూడా బీజేపీ గెలుస్తుందని ఒక్క సంస్థ మాత్రమే పసిగట్టగలిగింది… అంటే ఓటర్ నాడి అంత గుంభనంగా ఉంటోంది..
-వెంకటయోగి రఘురామ్