కరివేపాకు మన ఆరోగ్యానికి కల్పతరువు
మనం రోజూ కరివేపాకును వంటలో వినియోగిస్తూంటాం. కాని తినేప్పుడు దానిని తీసి పక్కన పెడతాం. `ఎవరినైనా చులకనగా చూస్తే ‘కూరలో కరివేపాకు’లా తీసిపారేస్తున్నారు అని అంటాం`. దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఎప్పటికీ తీసి పక్కన పెట్టరు. కూరల్లో సువాసన కోసం ఉపయోగించే ఈ ఆకులో మనకు తెలియని ఎన్నో ఔషధగుణాలున్నాయి.
పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా దాన్ని వంటల్లో వేసేవారు చాలా మందే ఉంటారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, క్యాలరీలు కూడా పుష్కలంగా లభిస్తాయి.
కరివేపాకులో పౌష్టిక విలువలు మాత్రమే కాదు.. ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు చాలా మేలు చేస్తుందంటారు. ఇందులోని కొయినిజన్ వంటి కొన్ని కెమికల్స్ డయాబెటిక్ పేషెంట్లకి చాలా అవసరం అంటారు నిపుణులు. అంతేకాదు జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా వచ్చే మధుమేహాన్ని కరివేపాకు ద్వారా అరికట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికీ కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వేసి కాచిన నూనెను తలకి మర్ధన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా మెరుస్తాయి. కరివేపాకును రోజూ ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చేస్తుంది.
ప్రయోజనాలు:
- రోగనిరోధక శక్తి ఉంటే కరోనాతోసహా ఏ వ్యాధి మన దరిచేరదు. కరివేపాకును రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తశుద్ధికి దోహదపడుతుంది.
- నులిపురుగుల నివారణకు సహాయపడుతుంది.
- కరివేపాకులో విటమిన్ సి ఉంటుంది. చర్మరోగాలను నివారిస్తుంది.
- జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
- ప్రతిరోజూ ఉదయం పరిగడపున కొన్ని ఆకులు నమిలితే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు.
- మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
- దురదలను తగ్గిస్తుంది.
- అజీర్ణం మూలంగా వచ్చే విరేచనాలకు కరివేపాకు మంచి మందు.
- కరివేపాకు ఆకులతో చేసిన కషాయాన్ని తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
- కరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే రక్త, జిగట విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కంటిచూపును మెరుగుపరుస్తుంది.
- కళ్లకింద నల్లనివలయాలను తగ్గిస్తాయి.
-పూర్ణిమ