శ్రీశైలం ఘటనలో 9 మంది మృతి
నాగర్‌కర్నూలు: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మృతుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు బయటకు తీసారు. మృతులను ఎఇ మోహన్కుమార్, ఎఇ ఉజ్మఫాతిమా, ఎఇ సుందర్‌గా గుర్తించారు. సహాయక చర్యలుకొనసాగుతన్నాయ. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పలువురు సహాయక సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.
జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న సుమారు 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగమార్గం ద్వారా బయటపడ్డారు. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు.
అధునాతన పరికరాలతో ఆపరేషన్ మొదలెట్టిన సిఐఎస్‌ఎఫ్ రెస్క్యూ టీం
ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా తెలంగాణ డిజి విజ్ఞప్తితో 35 మందితో కూడి సిఐఎస్‌ఎఫ్ రెస్క్యూటీం శ్రీశైలం చేరుకుంది. ఆధునాతన పరికరాలతో కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం పవర్ హౌజ్‌లోకి వెళ్లి ఆపరేషన్ మొదలుపెట్టింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని డిజి సివి ఆనంద్ తెలిపారు.
విద్యుత్ కేంద్రం వద్ద ఉన్న మంత్రి జగదీశ్ రెడ్డి, సీఎండీ ప్రభాకరావ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అధికారులను అడిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాద ఘనటనపై మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: అగ్నిప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.