రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలు

హైదరాబాద్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఇచ్చిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ (మంగళవారం) టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు. ఇక రాష్ర్ట వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు. అన్ని రంగాల వారు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రాస్తారోకోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసేందుకు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఇవాళ దేశవ్యాప్తంగా భారత్‌బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించాలని సీఎం కేజీఆర్ కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు సంయుక్తంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా నర్సంపేట రోడ్డు చౌరస్తాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ బైక్‌ను రైడ్ చేస్తుండగా.. మంత్రి సత్యవతి ఆ బైక్‌పై వెళ్లారు.
ఉరి తాళ్లతో రైతుల నిరసన
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైతులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిన్నారం గ్రామానికి చెందిన రైతులు ఉరి తాళ్లతో నిరసన తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు మిగిలేది ఉరి తాళ్లే అని రైతులు వాపోయారు.
[…] […]