భర్త ఎదుటే దారుణం: మహిళపై 17 మంది అఘాయిత్యం!

దుమ్కా (ఝార్ఖండ్): ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్ళ ప్రవర్తన మారడం లేదు. దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మహిళలపై ఘోరాలు జరుగుతూనే వున్నాయి. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. చివరకు తన భర్త తోడుగా ఉన్నా ఎక్కడ ఏ అఘాయిత్యం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తనకు తోడుగా ఉన్న భర్తపై దాడి చేసి, నిర్బంధించి అతడి కళ్ల ముందే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు కామాంధులు. తాజాగా ఝార్ఖండ్‌లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుమ్కా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం దంపతులు బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించి ఆమె భర్తపై దాడికి పాల్పడి నిర్బంధించారు. అతడి కళ్లముందే 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భర్త కళ్ల ముందే 17 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తుండగా. బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని చెబుతున్నారు.