టి.వేదాంత సూరి: తస్మాత్ జాగ్రత్త!

భారత రాజకీయాలు అస్థవ్యస్థంగా మారాయి. అక్కడ నాయకులు ఎవరూ లేరు, డబ్బు సంపాదించే వ్యాపారులుగా మారి పోయారు. కేవలం రాజకీయ నాయకులే కాదు, అధికారులు, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన వార్తా సంస్థలు కూడా వ్యాపార మాయమయ్యాయి. ఎవరిలో నిజాయితీ లేదు. సేవా రంగం సహితం డబ్బుకోసమే ఆశ పడుతుంది. కారణాలు ఏమైనా ఇప్పుడు ప్రజలు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఓటు వేసేముందు డబ్బు తీసుకోవడం. ఫలితం ఇలాగే ఉంటుంది. ఇక ప్రతిపక్షం పూర్తిగా విఫలమైంది. ప్రజలకు ఏం చేయాలో వారు ఆలోచించడం లేదు. నిరంతరం ప్రభుత్వం కాంట్రాక్టులు, ఏమిటి డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? అన్నదే ఆలోచన కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు, వారి ఇబ్బందులు ఏమిటి? వారికి ఏం కావాలో పట్టించుకోవడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మనో భావాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారు కానీ గెలిస్తే ఏం చేస్తామో చెప్పలేదు. ప్రజలు కూడా ఓటు వేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఎందుకు వేస్తున్నారు? ఆ నాయకులు తమకు ఎలా ఉపయోగపడతారు ఆలోచించడం లేదు. ఫలితముగా కొందరు నేరస్థులు కూడా గెలుపొందారన్న వార్తలు వచ్చాయి. మరి ఆ నేరస్థులు మనకు ఎలా ఉపయోగ పడతారు. గెలిచినా తరువాత తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడం, పదవులు పొందడం యెంత వరకు సమంజసం. ఒక సామాన్య పౌరుడిగా ఆలోచించండి. ఇన్ని ప్రయోజనాలు పొందుతూ ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం మరో పెద్ద నేరం. ఇలాంటి వారికి అన్ని సౌకర్యాలు రద్దు చేయాలి. లేకుంటే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుంది. మీకు ఏ పని కావాలన్నా నాయకులు అందుబాటులో వుండరు. అధికారులు సహకరించారు. అన్యాయం జరిగితే న్యాయస్థానాల్లో అవినీతి, సమస్యల పరిష్కారంలో జాప్యం, పత్రికలు కూడా ఏదో పార్టీకి కొమ్ము కాయడం. మరి ఏమిటి ఇప్పుడు పరిస్థితి. బుద్ధి జీవులు, మేధావులు మేల్కొని పరిస్థితిని చక్క దిద్దాలి. అంతే కానీ మౌన ప్రేక్షకులుగా మారే కూడదు. ఇప్పటికైనా అందరు మేల్కొనాలి. సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, ప్రజల అవసరాలు అవగాహన చేసుకోవాలి. లేకుంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుంది పరిపాలన. రాష్ట్రాలలోని, కేంద్రం లోను మంచి నాయకత్వం, రావలసిన అవసరం వుంది. సామాన్యులు సహితం ముందుకు వచ్చి సమాజ శ్రేయస్సుకోసం కృషిచేయడానికి రాజకీయాల్లోకి రావాలి. ఆరోగ్యం, విద్య సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఈ రెండు వ్యాపార సంస్థలుగా మారొద్దు. కులాలు, మతాలూ మరిచి మానవతకు పట్టం కట్టండి, భావితరాలకు సరైన మార్గం చూపండి. మానవ మనుగడ ప్రపంచ దేశాలు ఎత్తి చూపేవిలా ఉండొద్దు. ప్రపంచ దేశాల ముందు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. కోపం క్షణికం కావాలి. ప్రేమ శాశ్వతంగా మారాలి. అందుకోసం స్వార్థానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. అప్పుడు సమ సమాజ స్థాపన సాధ్యమవుతుంది.

–టి . వేదాంత సూరి

Leave A Reply

Your email address will not be published.