విడాకులపై విచారణ.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: విడాకులు, మెయిన్టేనెన్స్, వారసత్వ హక్కుల విషయంలో ఒకే రకమైన విధానాన్ని పాటించడం వీలువు అవుతుందా? విభిన్న మతాల వారికి ఇలాంటి అంశాల్లో ఆ విధానం అమలు చేయడం సాధ్యమా ? ఇలాంటి అంశాలపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. వారసత్వ హక్కుల విషయంలో ఉన్న అవరోధాలను తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను స్వీకరించిన సుప్రీం.. ఆ కేసులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. డైవర్స్, మెయిన్టేనెన్స్ లాంటి కేసుల్లో దేశ ప్రజలందరికీ ఒకే చట్టాన్ని అమలు చేసే అంశంపై అభిప్రాయాలు ఇవ్వాలంటూ కేంద్రాన్ని సుప్రీం కోరింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను ఇవాళ విచారించింది. అయితే ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించడం వల్ల వ్యక్తి చట్టాలను విస్మరించినట్లు అవుతుందని సీజే అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత చట్టాలను రద్దు చేయాలని మీరు కోరుతున్నారు, మీరు నేరుగా ఆ అంశాన్ని అడగపోయినా.. కానీ జరిగేది అదే కాదా, పర్సనల్ చట్టాలను ఎలా నిర్వీర్యం చేస్తామని సీజేఐ బోబ్డే అన్నారు. సీనియర్ అడ్వకేట్లు పింకీ ఆనంద్, మీనాక్షీ అరోరాలు పిటిషనర్ అశ్వినీ కుమార్ యాదవ్ తరపున వాదించారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలకు.. ఏ మతం ఆధారంగా ఒకే రకమైన విధానాన్ని పాటించడం వీలవుతుందని సీజే బోబ్డే ప్రశ్నించారు.