గ్రీన్ టీ తో ఎన్నో ప్రయోజనాలు..

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంమీద శ్రద్ద పెడుతున్నారు. ఏమి తినాలో,తినకూడదో తెలుసుకుని మరీ ఆహారనియమాలు పాటిస్తున్నారు. అందులో భాగంగా గ్రీన్‌టీని అందరూ వాడడం మొదలు పెట్టారు. బరువు తగ్గేందుకు, గుండె పనితీరు మెరుగుపరిచేందుకు, క్యాన్సర్ నివారణకు గ్రీన్‌టీ అత్యుత్తమమైనది అని వైద్యనిపుణులు చెప్తున్నారు.
అంతేకాదు గ్రీన్‌టీ మన శరీరానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న యాంటీఆక్సి డెంట్స్ రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది. ఇన్ఫెక్షన్ల బారినుండి రక్షిస్తుంది అంతేకాదు ఇది శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. శరీరంలో ఏర్పడే కొవ్వును తొలగించి, తద్వారా శరీరం అధిక బరువు సమస్య నుంచి కాపాడుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్థాల నుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలకు బదులుగా గ్రీన్‌టీ నీ తాగడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు.
అయితే గ్రీన్‌టీ ఎలా ఉపయోగించాలి.
- గ్రీన్ టీ మంచిది అని ఎన్ని సార్లు తీసుకున్నా తప్పు కాదని భావిస్తుంటారు. కానీ అది సరి కాదు. మామూలు కాఫీ, టీలలో ఉన్నట్లే గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. అందుకే రోజుకి రెండు మూడు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూడదు.
- భోజనం చేసిన వెంటనే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం మంచిది కాదు. ఆహారంలో ఉన్న ప్రొటీన్‌ని శరీరం గ్రహించుకోనివ్వదు. ఇది గ్రీన్‌టీకి కూడా వర్తిస్తుంది.
- గ్రీన్ టీని వేడిగా తాగకూడాదు. గోరు వెచ్చగా తాగాలి.
- పరగడుపున ఎప్పుడూ తాగకూడదు. ఖాళీ కడుపులో ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. గ్రీన్ టీ ఎప్పుడైనా ఏదైనా తిన్న తరువాతే తీసుకోవాలి.
- వేడిగా ఉన్నప్పుడు గ్రీన్‌టీలో తేనె కలపకూడదు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి.
- ఇక ట్యాబెట్లు లాంటివి గ్రీన్ టీ తాగే ముందు వేసుకోకూడదు.
- గ్రీన్ టీ బ్యాగ్‌ని కానీ, ఆకులు కానీ ఎక్కువ సేపు వేడి నీటిలో ఉంచకూడదు.
- గ్రీన్ టీ బ్యాగ్స్‌ని గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి.
-పూర్ణిమ