నేటి నుంచి కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ

బెంగళూరు: ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్‌లో వెలుగచూసిన కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ర్టాలు వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని, ఇది జనవరి 2వ తేదీ వరకు అమలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం కోరారు.
అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి
బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటకకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి సారించామని ఆ రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కొత్త రకం కరోనా వైరస్ కారణంగానే రాష్ర్టంలో నైట్ కర్ఫ్యూ విధించామని పేర్కొన్నారు. నేటి నుంచి జనవరి 2 వరకు రాత్రిళ్లు ఎలాంటి సెలబ్రేషన్స్‌కు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు.
కాగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. డిసెంబర్ 31, నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. తాజా వైరస్ ముప్పుపై బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.