అక్రమ నల్లా కనెక్షన్ పొందిన నలుగురిపై కేసు నమోదు

హైదరాబాద్ (CLiC2NEWS) : కాప్రాలోని కేసీఆర్ కాలనీలో దాదాపు 130 అక్రమ నల్లా కనెక్షన్లను జలమండలి అధికారులు గుర్తించారు. ఈ కాలనీకి చెందిన నలుగురిపై జలమండలి విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసారు.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కాప్రాలోని కేసీఆర్ కాలనీకి చెందిన దోమటి కిరణ్ కుమార్, కాలనీ ప్రెసిడెంట్ గా, వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ గా, వెంకటేశం, ట్రెసరర్ గా మరియు పరుశురామ్, సెక్రటరీలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నలుగురు వ్యక్తులు జలమండలి నిబంధనలకు విరుద్ధంగా అధికారుల అనుమతి లేకుండా కాలనీలో దాదాపు 130 అక్రమ నల్లా కనెక్షన్లు ఇప్పించి జలమండలి ఆదాయానికి గండి కొట్టారు. సమాచారం అందుకున్న జలమండలి విజిలెన్స్ అధికారుల బృందం సోదాలు చేయగా అక్రమ కనెక్షన్లు ఇచ్చిన విషయం బయటపడింది. తనిఖీలో భాగంగా బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత వ్యక్తులైన దోమటి కిరణ్ కుమార్, వెంకటేష్, వెంకటేశం, పరుశురామ్ ల మీద జలమండలి అధికారులు స్థానిక జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో యు/ఎస్ 269, ఐపీసీ సెక్షన్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) చట్టం ప్రకారం కేసు నమోదు చేసారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందంకు 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని జలమండలి అధికారులు ఓ ప్రకటనలో కోరారు.