అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న వ్యక్తిపై క్రిమినల్ కేసు..
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ – 19లోని పీర్జాదిగూడ సెక్షన్ పరిధిలో గల మల్లిఖార్జుననగర్‌లో నివసించే తక్ చిర్దిచంద్(Tak Chirdichand) అనే వ్యక్తి తన ఇంటికి 15 ఎంఎం పైప్ సైజు నల్లా కనెక్షన్‌ను అక్రమంగా తీసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌ను తొలగించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న చిర్దిచంద్‌పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో యు/ఎస్ 430, 269 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్‌కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని జలమండలి అధికారులు ప్రకటనలో తెలియజేశారు.