పదో తరగతి విద్యార్థిని కోసం ‘గ్రీన్ కారిడార్’..!

కోల్‌కతా (CLiC2NEWS): పరీక్ష రాసేందుకు వెళ్తున్న ఓ విద్యార్థిని కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ఇన్‌స్సెక్టర్. సాధారంణంగా రాజకీయ నాయకులు, అధికారుల కోసంగాని, అవయవాల తరలింపు కోసం గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ దీనికి భిన్నంగా ఓ విద్యార్థినికి గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసిన ఘటన కోల్‌కతాలోని హావ్‌డా వంతెన సమీపంలో చోటుచేసుకుంది.
ఓ విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో ఉండి రోడ్డు ప్రక్కన నిల్చుని ఉంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కొంత మందిని ఆపి సాయం చేయాల్సిందిగా కోరుతుంది. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విద్యార్థిని ఎందుకు ఏడుస్తున్నావని అడిగగా.. నేను 10వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి సాయం చేయాలని కోరింది. నీతోపాటు ఎవరూ రాలేదా అని ప్రశ్నించగా.. తన తాత చనిపోవడంతో అందరూ అంత్యక్రియలలో పాల్గొనడానికి వెళ్లారని బదులిచ్చింది. అప్పటికి పరీక్ష సమయం 10 నిమిషాలే ఉండటంతో ఇన్‌స్పెక్టర్ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాల్సిందిగా ట్రాఫిక్ కంట్రోల్‌కు ఆదేశాలు జారీ చేశారు. 11.30 కల్లా విద్యార్థినిని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు.