ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ (CLiC2NEWS): నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని కెసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు స్త్రీ, శిశు సంక్షేయ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమశాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, సమర్థవంతమైన సేవలు అందించడానికి జిల్లా స్థాయిలో సంక్షేమ అధికారిని నియమిస్తారు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖాపరమూన ఏర్పాట్లు చేయనున్నారు.
దివ్యాంగులు సంక్షేమంపై మరింత దృష్టి సారించేందుకు వీలుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని సిఎంకు చేసిన విజ్ఞప్తి చేయగా.. ఆయన దివ్యాంగుల ప్రత్యేక మంత్రిత్వశాఖకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంత్రి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసరా అవసరమైన దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి డబుల్ బెడ్ రూం, దళితబంధు పథకాలతో పాటు.. ఇతర పథకాలలో 5% రిజర్వేషన్, ఉద్యోగ నియామకాలలో 4% రిజర్వేషనన్‌ను అమలు చేస్తామన్నారు. అదేవిధంగా వారికి ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరెన్నో అభివృద్ధి కార్యక్రామాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తోందని సిఎం తెలిపారు.