వేలిముద్ర లేకున్న ఐరిస్ ద్వారా ఆధార్ పొందొచ్చు

ఢిల్లీ (CLiC2NEWS): ఫింగర్ ప్రింట్స్ పడకపోయినా ఐరిస్ ఆధారంగా ఆధార్ కార్డు పొందవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఓ మహిళ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంది. కేరళలోని పి జోస్ అనే మహిళకు వేళ్లు లేని కారణంగా ఆధార్ జారీకి అర్హత ఉన్నా ఆధార్ కార్డు పొందలేకపోయింది. ఈ విషయం గురించి ఐటి సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ స్పందించారు. ఇటువంటి వైకల్యం ఉన్నా.. లేదా వేలిముద్రలు సరిగ్గా లేకపోయినా బయోమెట్రిక్‌కి బదులు ఐరిస్ ఆధారంగా ఆధార్ జారీ చేయాలని పేర్కొన్నారు. ఐరిస్, వేలిముద్రలు సమర్పించలేకపోయినా అర్హులైన వారికి కూడా ఆధార్ అందజేయాలని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. బయో మెట్రిక్ వీలుకాని పక్షంలో ఐరిస్.. లేదా రెండు సమర్పించలేకపోతే, వాటికి గల కారణాలు తెలుపుతూ ఫోటో ద్వారా ఆధార్‌కు నమోదు చేసుకోవచ్చు.