మాజి మంత్రి కెటిఆర్‌కు ఎసిబి నోటీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మాజి మంత్రి, బిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కెటిఆర్‌కు అవినీతి నిరోధ‌క శాఖ (ఎసిబి) నోటీసులు జారీ చేసింది. ఫార్ములా – ఇ రేసింగ్ కేసులో ఎసిబి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేసింది. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 6వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఫిర్యాదు దారు పుర‌పాల‌క శాఖ (ఎంఎయుడి) ముఖ్య కార్య‌ద‌ర్శి దాన కిశోర్ నుండి ఎసిబి వివ‌రాల‌ను సేక‌రించింది. తెలంగాణ మున్సిప‌ల్ శాఖ‌, ఫార్ములా – ఇ ఆప‌రేష‌న్స్ లిమిటెడ్ (ఎఫ్ఇఒ) ల మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం, అందులో చోటుచేసుకున్న ఉల్లంఘ‌న‌ల‌పై అధ్య‌య‌నం చేస్తోంది.

హైద‌రాబాద్‌లో  ఫార్ములా-ఇ రేస్‌ను నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి, లండ‌న్ ఎఫ్ఇఒ ల మ‌ధ్య  2022 ఏడాది జ‌న‌వ‌రిలో ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన ద‌స్త్రం పుర‌పాల‌క శాఖ‌లో లేన‌ట్లు తెలుస్తోంది. అదే సంవ‌త్స‌రం జులై 11న జిఒ జారీ చేశారు. దీనిలో లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్ గురించిన ప్ర‌స్తావ‌న ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ జిఒ ఆధారంగా రేసు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంత‌కం చేయ‌డానికి ముందే  అప్ప‌టి మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌భుత్వం మేనేజింగ్ క‌మిటిని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. అదే ఏడాది అక్టోబ‌ర్ 25న న‌గ‌రంలో 9, 10, 11, 12 సీజ‌న్‌ల‌లో ఫార్ములా-ఇ రేస్‌ల‌ను నిర్వ‌హించేందుకు ఎంఎయుడి, ఎఫ్ ఇఒ, ఎస్ నెక్ట్స్‌జెన్ ప్రేవేట్ లిమిటెడ్ మ‌ధ్య త్రైపాక్షిక (తొలి) ఒప్పందం కుదిరింది. ఆ స‌మ‌యంలో సీజ‌న్-9 కి సంబంధించిన నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డానికి అర్వింద్ కుమార్‌.. ప్ర‌భుత్వంలోని కాంపిటెంట్ అథారిటి నుండి ఆమోదం తీసుకోలేద‌ని, ప్ర‌భుత్వ‌ము ఎలాంటి ఉత్త‌ర్వులు జారీ చేయలేద‌ని గుర్తించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.