రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు.. డిసెంబర్ 28 నుండి దరకాస్తులు స్వీకరణ
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఈనెల 28 నుండి జనవరి 6 వరకు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆదివారం సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. సమావేశానంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివారలను మీడియాకు వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని, డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా ఆ దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన అనంతరం అధికారులు వారికి ఒక రసీదు ఇస్తారని తెలిపారు. గూడెంలలో 10 ఇళ్లున్నా అధికారులే వెళ్లి దరఖాస్తు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించామని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు చేసిన రోజే రెండు హామీలు అమలు చేశారు. ఈ నెల 28 నుండి ఆరుగ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ చేపడతామని వెల్లడించారు.