దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద ప్రమాదం

నాగర్కర్నూల్ (CLiC2NEWS): శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుండి ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే దిశగా పనులు చేపట్టారు. దీనిలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ ఉదయం జరుగుతున్న పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పై భాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు.
ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులను తిరిగి ప్రారంభించింది. దీనిలో భాగంగా నాలుగు రోజుల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. పని జరుగుతుండగా మొదటి షిప్టులో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. అకస్మాత్తుగా పైకప్పు కూలి మట్టి పెల్లలు విరిగి పడ్డాయి . కార్మికులలో 42 మంది బయటికి రాగలిగారు మిగిలిన 8 మంది లోపలే చిక్కుకున్నట్లు సమాచారం. టన్నెల ఘటన తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సహాయక చర్యలు వెంటనే జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.