‘భారతీయ సినిమా ఒక మతం అయితే.. ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి’: చిరంజీవి

హైదరాబాద్ (CLiC2NEWS): చిరంజీవి – రామచరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి, రామ్‌చరణ్ ఆసక్తి గల విషయాలు వెల్లడించారు. రాజమౌళి వల్లనే ఆచార్యలో నటించగలిగానని, కొరటాల శివ కారంణంగానే RRR లో అడుగుపెట్టానని చరణ్ తెలిపారు. ఇక ఈ సినిమాతో నాన్నా నేను కలిసి ఎక్కువ సమయం గడిపామని చరణ్ అన్నారు. ‘ఆచార్య’ మాకు మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చిందని, ఈ సినిమా కోసం మారేడుపల్లిలో 20 రోజులు ఉన్నామని, నిద్రలేవడం, కసరత్తులు, భోజనం, పడుకోవడం.. ఇలా ప్రతీదీ కలిసే చేసేవాళ్లం అని చరణ్ తెలిపారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ఒకప్పుడు దక్షిణాది చిత్రాలంటే ఉత్తరాది వారికి చిన్న చూపు ఉండేదని అన్నారు. ‘రుద్రవీణ’కు జాతీయ అవార్డు వస్తే, ఢిల్లీ వెళ్లాం. అవార్డు తీసుకునే ముందు.. అక్కడ గోడపై ఇండియన్ సినిమా వైభవం పేరుతో పోస్టర్లు ఉంచారు. అక్కడ సినిమాలు, నటుల గురించి వివరణ ఇచ్చారు. పృథ్వీరాజ్‌కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్, అమితాబ్ ఇలా ప్రతి ఒక్కరినీ చూపించారు. దక్షణాది సినిమాల విషయానికొస్తే ఎంజిఆర్-జయలలిత డ్యాన్స్ చేస్తున్న స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ప్రేమ్ నజీర్ గారి ఫోటో వేశారు. అంతే , కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, విష్ణు వర్ధన్, తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజి గణేశన్ ఇలా మహా నటులకు సంబంధించిన ఒక్క పోటో కూడా లేదు. ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే చూపించారు. అప్పుడు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు నేను గర్వపడేలా, రొమ్ము విరుచుకుని నిలబడేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసి, ఇండియన్ సినిమా అని గర్వపడేలా ‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ దోహదపడ్డాయాని చిరంజీవి అన్నారు. అలాంటి సినిమాల నిర్మాణ కర్త రాజమౌళి ఇక్కడ ఉండటం గర్వకారణం. జీవితాంతం తెలుగు సినిమా రాజమౌళిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు.
‘భారతీయ సినిమా ఒక మతం అయితే.. ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి’ అని అన్నారు.